నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లకు నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలి
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల/ధర్మపురి, సెప్టెంబర్11,(నవగీతం): ధర్మపురి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌లో భాగంగా జారీ చేస్తున్న నోటీసులు, వాటిపై నిర్వహిస్తున్న విచారణ ప్రక్రియ, ఓటర్ల నుంచి సేకరిస్తున్న ఆధారాలు,ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఎస్‌ఐఆర్ నోటీసులపై విచారణను పూర్తి స్థాయిలో, నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల నుంచి సేకరించిన ఆధారాలు, సంబంధిత వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు, తేడాలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

నో మ్యాపింగ్ ఓటర్లు, అనామలీస్ ఓటర్లకు సంబంధించిన అన్ని నోటీసులను సంబంధిత ఓటర్లకు వ్యక్తిగతంగా అందజేయాలని ఆదేశించారు. నోటీసుల జారీ, అందజేత, విచారణ, ఓటర్ల నుంచి ఆధారాల సేకరణ, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు తదితర ప్రతి దశను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. అదే సమయంలో అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సరిదిద్దేలా చర్యలు చేపట్టాలని సూచించారు.“అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే మన లక్ష్యం. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, నిబంధనలను కచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమని” జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు.అనంతరం 2027 లో రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి లోని గోదావరి నది వద్ద జరుగుతున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా పనులను వేగవంతంగా, ప్రణాళికలకు అనుగుణంగా భక్తులకు, విఐపి లకు అసౌకర్యం కలుగకుండా పుష్కర ఘాట్లను నిర్మించాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగ లక్ష్మీ,, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఇంజనీర్ శాఖ అధికారులు బిఎల్ వో లు తదితరులు పాల్గొన్నారు.
