జగిత్యాల,అక్టోబర్03,(నవగీతం)
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని, మెట్పల్లి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వసతి గృహాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీరు, సక్రమమైన పారిశుధ్య నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వారితో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అదేవిధంగా వసతి గృహాల్లో అదనంగా నిర్మిస్తున్న వంటశాల, గదుల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో, ఇప్పటివరకు ఎంత మేరకు పనులు పూర్తయ్యాయో, మిగిలిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేయవచ్చో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చడంతో పాటు, నిర్మాణంలో ఉన్న అదనపు సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ పరిశీలనలో మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు, ఈఈ, పీఆర్ అధికారి లక్ష్మణరావు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి జై రాజ్, మండల తహసీల్దార్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
