navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 3:06 pm Digital Edition : NAVAGEETAM

కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

పదో తరగతి విద్యార్థినులకు విద్యాభ్యాసం, పరీక్షల సన్నద్ధతపై మార్గనిర్దేశం

జగిత్యాల, సెప్టెంబర్11,(నవగీతం): జగిత్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచితో పాటు విద్యార్థినులకు అందుతున్న ఆహారంపై వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, వారి విద్యాభ్యాసం, పరీక్షల సన్నద్ధతపై మార్గనిర్దేశం చేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుతూ, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిని తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, పరీక్షల కోసం అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతి, భోజనం తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఉన్నారు.