100 పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి – ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల/కొరుట్ల,అక్టోబర్ 28 (నవగీతం)
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ మాట్లాడుతూ.. కోరుట్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే సేవలు..!
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు కల్పించాల్సిన 100 పడకల ఆసుపత్రి ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే సేవలు అందిస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఉన్నప్పటికీ, దాదాపు మూడేళ్లుగా అది వినియోగంలో లేకుండా తాళం వేసి ఉండటం, తాళం చెవి అందుబాటులో లేకపోవడంతో తాళం పగలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇంతటి కీలకమైన వైద్య సదుపాయం నిరుపయోగంగా ఉండటం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై శ్రద్ధ చూపాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలపై తగిన శ్రద్ధ చూపడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన శస్త్రచికిత్సలు, వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
వెంటనే నిధులు మంజూరు చేయాలి
కోరుట్ల ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, 100 పడకల ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.