navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 8:45 am Digital Edition : NAVA GEETAM

గంటలోనే 10 తులాల బంగారం రికవరీ

డయల్ 112 ఫిర్యాదుపై బుగ్గారం పోలీసుల తక్షణ స్పందన

జగిత్యాల/బుగ్గారం,నవంబర్8,(నవగీతం)

బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పొరపాటున పోగొట్టుకున్న 10 తులాల బంగారాన్ని డయల్ 112కు వచ్చిన ఫిర్యాదుపై బుగ్గారం పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించారు. బుగ్గారం ఎస్‌ఐ శ్రీకాంత్, బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సంపత్ (2177) చాకచక్యంగా వ్యవహరించి బంగారాన్ని రికవరీ చేయడంతో బాధితుడు ఊరట చెందాడు.

వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి మండలానికి చెందిన మూట శంకర్ తన మరదలి వివాహం నిమిత్తం బొంబాయిలో 10 తులాల బంగారం కొనుగోలు చేసి బ్యాగులో భద్రపరుచుకొని ధర్మపురికి బయలుదేరాడు. జగిత్యాల నుంచి ధర్మపురికి వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా వెల్గొండ స్టేజీ దాటిన అనంతరం తన బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.

ఫిర్యాదుపై వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సంపత్ (2177) విషయాన్ని ఎస్‌ఐ శ్రీకాంత్‌కు తెలియజేశారు. దీంతో ఎస్‌ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ సంపత్‌తో కలిసి వెల్గొండ స్టేజీ పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. గ్రామంలోని యువకులను ఆరా తీస్తూ, రాత్రి సమయంలో కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా అనే కోణంలో వివరాలు సేకరించారు.

ఈ క్రమంలో యువకులు అందించిన సమాచారంతో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి విచారించగా, బస్సులో తన బ్యాగు అనుకొని పొరపాటున మరొకరి బ్యాగును తీసుకువచ్చినట్లు గుర్తించారు. రెండు బ్యాగులు ఒకే విధంగా ఉండటంతో జరిగిన పొరపాటును నిర్ధారించుకొని బ్యాగును తనిఖీ చేయగా, అందులోని చిన్న బ్యాగులో భద్రపరిచిన 10 తులాల బంగారం లభించింది.

అనంతరం ఎస్‌ఐ శ్రీకాంత్ బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితుడు మూట శంకర్‌తో పాటు అతని బావమరిదిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బంగారాన్ని వారికి అప్పగించారు.

డయల్ 112కు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, కేవలం గంట వ్యవధిలోనే పోగొట్టుకున్న 10 తులాల బంగారాన్ని గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించిన ఎస్‌ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ సంపత్‌లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలకు ఆపద సమయంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112ను సంప్రదించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సూచించారు.