కరీంనగర్, అక్టోబర్05,(నవగీతం)
మాజీ ఎంపీ, మాజీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రముఖ దళిత ఉద్యమ నేత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి (కాకా) చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై కాకా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి (కాకా) బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని గడ్డం వెంకటస్వామి (కాకా)కు ఘనంగా నివాళులు అర్పించారు.
