navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 1:32 pm Digital Edition : NAVA GEETAM

ఘనంగా ప్రారంభమైన ‘సర్కారు బడి’ పాట షూటింగ్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించడమే లక్ష్యం

మల్లాపూర్, అక్టోబర్3,(నవగీతం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో సోమవారం లింగంపల్లి నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు బడి’ పాట షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య క్లాప్ కొట్టి షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాట దర్శకుడు లింగంపల్లి నరేష్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుబాటులో ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో ఈ పాటను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను, అక్కడ అందుతున్న విద్యా సౌకర్యాలను ఈ పాట ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పాట ద్వారా ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై మరింత నమ్మకం, అవగాహన పెరుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, పాట దర్శకుడు లింగంపల్లి నరేష్, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, వీడీసీ సభ్యులు అంతడుపుల గంగాధర్, మారు శేఖర్ రెడ్డి, పాల్తేపు రాజారెడ్డి, కల్వకుంట నరేష్, గొర్రె మోహన్, దప్పుల నరేష్, గుర్రపు సతీష్, ముత్యాల లక్ష్మీనారాయణ, మార్గం మారుతి, సామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.