navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 2:14 am Digital Edition : NAVAGEETAM

జనగణన–2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జనగణన–2027 కార్యక్రమం నిర్వహణలో భాగంగా తొలి దశలో నిర్వహించనున్న హౌస్‌లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్ కు సంబంధించి జిల్లా, చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం జగిత్యాల జిల్లా ఐడీఓసీలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. జనగణన కార్యక్రమం దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. ప్రజల నివాస గృహాల వివరాలు, మౌలిక సదుపాయాల స్థితి, కుటుంబాల వివరాలు తదితర అంశాలను ఈ దశలో నమోదు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్ లత మాట్లాడుతూ జనగణన ప్రక్రియ పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి అధికారి మీద ఉందన్నారు. శిక్షణలో భాగంగా డేటా సేకరణ విధానం, డిజిటల్ పరికరాల వినియోగం, ఫీల్డ్ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

కేటాయించిన అధికారులు పూర్తి స్థాయిలో శిక్షణ పొంది అవగాహన పొందాలని తెలిపారు. జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికకు అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు సిద్ధమవుతాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, చార్జ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.