navageetam.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 3:17 pm Digital Edition : NAVAGEETAM

ట్రాక్టర్ ప్రమాదం.. మొగిలిపేట కన్నీటి సముద్రం

నలుగురి మృతి – శోకసంద్రంలో ముగిసిన అంత్యక్రియలు

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామంలో మంగళవారం జరిగిన ఘోర ట్రాక్టర్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, న్యాయం జరిగే వరకూ తమ నిరసన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. చివరికి పోలీసుల హామీతో ఆందోళన విరమించడంతో, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాలు గ్రామానికి చేరుకోగానే మొగిలిపేట గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడం గ్రామ ప్రజలను మరింత కలచివేసింది. అందులో ఆరో తరగతి చదువుతున్న వైష్ణవి విగతజీవిగా కనిపించడంతో ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు పొంగాయి. గ్రామస్తులు, బంధుమిత్రుల సమక్షంలో తీవ్ర విషాద వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.