navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 12:51 pm Digital Edition : NAVA GEETAM

ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

రూ. 2.57 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక సౌకర్యాల కల్పన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రూ. 13 వేల కోట్ల మేర లబ్ధి

2027 గోదావరి పుష్కరాల కోసం రూ. 226 కోట్లతో అభివృద్ధి పనులు

జగిత్యాల/ధర్మపురి, అక్టోబర్25,(నవగీతం):

ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ. 2.57 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆధునీకరణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.

బస్‌స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలు

ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రాజెక్టులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, సీసీ పేవ్‌మెంట్, గ్రానైట్ ఫ్లోరింగ్, భవనానికి ఏసీపీ క్లాడింగ్, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు, రూఫ్ స్లాబ్, సీలింగ్ మరమ్మతులు చేపట్టనున్నారు. అదేవిధంగా వర్షపు నీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి, పెయింటింగ్, పల్లపు ప్రాంతాల్లో కంకర వేయడం, ల్యాండ్‌స్కేపింగ్, విద్యుదీకరణ, పంప్‌సెట్‌తో కూడిన బోర్‌వెల్ ఏర్పాటు చేయనున్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ సేవల విస్తరణ

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 360 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలకు దాదాపు రూ. 13 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు విస్తరించడంతోపాటు బాసర, భద్రాచలం, ధర్మపురి, గూడెం, కాళేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ధర్మపురి నుంచి ముంబైకి ఏసీ బస్సు నడిపే ప్రతిపాదనను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటుకు చర్యలు

1993లో ప్రారంభమైన ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటు చేయాలన్న స్థానిక ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని, ఎన్నికలకు ముందే డిపో నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని కోరినట్లు వెల్లడించారు.

పుష్కరాల అభివృద్ధికి రూ. 226 కోట్లు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 10 కోట్లు, పుష్కర ఘాట్లు, బైపాస్ రహదారులు తదితర అభివృద్ధి పనులకు సుమారు రూ. 226 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, బస్‌స్టేషన్ ఆధునీకరణతో వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధితో పుష్కరాల సమయంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు.

నాణ్యతతో పనులు పూర్తి చేయాలి:: కలెక్టర్

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..

బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టి, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వర్షపు నీటి పారుదల వంటి సదుపాయాలు సక్రమంగా అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దినేష్,ఆర్.టి.సి. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.