హైదరాబాద్ (నవగీతం ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో పార్టీని కష్టకాలంలో నిలబెట్టిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, రాజకీయ ఇబ్బందులు, ఆర్థిక భారాలు ఎదురైనా పార్టీని వీడకుండా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పనిచేసినవారే 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పునాది వేశారు. అయితే అధికారం వచ్చిన తర్వాత తమ కష్టానికి తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన కొంతమంది పాత కార్యకర్తల్లో పెరుగుతోంది.
ఇది కేవలం పదవులు దక్కలేదనే అసంతృప్తిగా చూడకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం సమయం, డబ్బు, వ్యక్తిగత రాజకీయ అవకాశాలను పణంగా పెట్టిన కార్యకర్తకు అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాటకు విలువ లేదనే భావన కలిగితే, అది వ్యక్తిగత నిరాశను దాటి సంస్థాగత సమస్యగా మారుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో గతంలోనూ ఇలాంటి అసంతృప్తి కనిపించింది. ఉదాహరణకు, ఖమ్మంలో దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను పక్కనపెట్టారనే ఆరోపణలతో కార్యకర్తలు బహిరంగంగా నిరసనకు దిగిన సందర్భం నమోదైంది.
ప్రస్తుతం ప్రధాన సమస్య కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారశైలితో ముడిపడి ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. కార్యకర్తలందరితో కాకుండా కొద్దిమంది సన్నిహితులతోనే నిర్ణయాలు తీసుకోవడం, పాత నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం లేకపోవడం, పార్టీ కోసం చాలాకాలంగా పనిచేసినవారికి అవకాశాలు రాకపోవడం వంటి భావనలు బలపడితే అసంతృప్తి సహజంగానే పెరుగుతుంది. ప్రతి ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పడం కాదు కానీ ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్,రంగారెడ్డి వంటి జిల్లాల్లో చాలా మంది ఎమ్మెల్యేలపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి.
కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించడం కూడా సహజమే. అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇతర పార్టీల నుంచి నాయకులు రావడం రాజకీయ ప్రక్రియలో భాగం. అయితే కొత్తవారికి అవకాశం కల్పించే సమయంలో పాత కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందనే భావన రాకుండా చూడటం నాయకత్వ బాధ్యత. లేకపోతే కొత్త బలం సంపాదించే క్రమంలో ఉన్న బలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే చాలాచోట్ల ఈ పరిస్తితి కనిపిస్తోంది.
కార్యకర్తల సమస్యకు ప్రతి ఒక్కరికీ పదవి ఇవ్వాలని కాదు కానీ వారికి గౌరవం, భాగస్వామ్యం, గుర్తింపు ఇవ్వడం ముఖ్యం. పార్టీ సమావేశాలకు పిలవడం, స్థానిక నిర్ణయాల్లో అభిప్రాయం తీసుకోవడం, ఎన్నికల్లో చేసిన కృషిని గుర్తించడం, పార్టీ బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచుతాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్లు గతంలోనే వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదే డిమాండ్ సీనియర్ కార్యకర్తల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ల కాలంలో సొంత డబ్బును ఖర్చు చేస్తూ, ఆర్థికంగా నష్టపోతూ కూడా పార్టీని భుజాలపై మోసిన సీనియర్ కార్యకర్తలను గుర్తించి, వారికి తగిన రాజకీయ గౌరవంతో పాటు అర్హతను బట్టి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఉంది.
రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో నేరుగా సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలి. ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చే నివేదికపైనే ఆధారపడకుండా మండల, బూత్, జిల్లా స్థాయి నాయకుల అభిప్రాయాలను కూడా సేకరించాలి. ఎక్కడ కార్యకర్తల అసంతృప్తి ఎక్కువగా ఉందో గుర్తించి అక్కడ ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలి.
పదవుల విషయంలో కూడా స్పష్టమైన ప్రమాణాలు అవసరం. పార్టీకి చేసిన సేవ, ఎన్నికల సమయంలో నిర్వహించిన బాధ్యత, ప్రజల్లో ఉన్న సంబంధాలు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నిర్ణయాలపై అనుమానాలు తగ్గుతాయి. అదే సమయంలో కొత్తగా వచ్చిన నాయకులకు అవకాశాలు ఇవ్వడంలో కూడా ఒక సమతుల్యత పాటించాలి.
మరో కీలక అంశం పార్టీ క్రమశిక్షణ. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, కార్యకర్త అయినా ఒకే సంస్థాగత ప్రమాణాలు వర్తించాలి. పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగమవుతున్నాయనే వార్తలు ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో నాయకత్వం సమస్యలు ముదరకముందే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్‌కు ఇప్పుడు అత్యంత అవసరమైనది కార్యకర్తలపై నియంత్రణ కాదు, వారి విశ్వాసాన్ని తిరిగి బలపరచడం. ఎన్నికల సమయంలో మాత్రమే కార్యకర్తను గుర్తించి, అధికారం వచ్చిన తర్వాత అతనిని పట్టించుకోకపోతే సంస్థాగతంగా పార్టీ బలహీనపడుతుంది. బూత్ స్థాయి కార్యకర్తే చివరికి ఓటరుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాడు. అతని ఉత్సాహం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.
అధికారంలో ఉన్నప్పుడే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తల అసంతృప్తిని పరిష్కరించగలిగితే అది కాంగ్రెస్‌కు భవిష్యత్ ఎన్నికల్లో బలంగా మారుతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం పదవులు, అధికారం ఉన్నప్పటికీ పార్టీ పునాది బలహీనపడే ప్రమాదం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రస్తుతం అవసరమైనది కొత్త హామీలు కాదు.. పార్టీ కోసం సొంత ఖర్చులు పెట్టుకుని పదేళ్లు కష్టపడిన పాత కార్యకర్తకు గౌరవం, అర్హత ఉన్న వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం, నాయకత్వంపై విశ్వాసం కలిగించే నిర్ణయాలు, పదవుల పంపకంలో పారదర్శకత, ఎమ్మెల్యేలు..కార్యకర్తల మధ్య నిరంతర సమన్వయం. ఇవి బలపడితేనే అధికారాన్ని పార్టీకి సంస్థాగత బలంగా మార్చుకోగలదు. లేకపోతే అధికారం ఉన్నా.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తే దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. కార్యకర్తను కాపాడుకోవడం అంటే కేవలం ఒక వ్యక్తిని కాపాడుకోవడం కాదు.. కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ పునాదిని కాపాడుకోవడం.