navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 10:08 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పరిశుభ్రత వర్షాకాల జాగ్రత్తలపై అవగాహన

నవగీతం (రాయికల్ ప్రతినిధి)

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాయికల్ మున్సిపాలిటీ 9వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, 9వ వార్డు కౌన్సిలర్ బత్తిని మహేశ్వరి–నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సభలో వారు మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురికి కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు వంటి వ్యర్థాలను వేయకుండా చెత్త బండికి అందించాలని కోరారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల నీరు నిలిచి దోమలు వ్యాపించి విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు.ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 9వ వార్డులో నెలకొన్న తక్కువ వోల్టేజ్ విద్యుత్ సమస్యను విద్యుత్ శాఖ ఏఈ నవీన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు వార్డు ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. నీటి సమస్యను తగ్గించే లక్ష్యంతో కొత్తగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్, మేనేజర్ వెంకటి, విద్యుత్ శాఖ ఏఈ నవీన్, వార్డు ఆఫీసర్ సుష్మ, ఆర్పీ శ్యామల, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల నాయకులు, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.