navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 3:06 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పీఎంజీ దొంగ‌త‌నం కేసును చేధించిన క‌రీంన‌గ‌ర్ పోలీసులు

ముఠాలోని ముగ్గురు స‌భ్యుల అరెస్టు..మ‌రో ఇద్ద‌రు పరారీలో

నేబీహార్‌ జైలు నుంచే ‘గోల్డెన్‌ థీఫ్‌’ ఆపరేషన్

నవగీతం, కరీంనగర్

కరీంనగర్ నగరాన్ని వణికించిన ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో కీలక నిందితుడితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేయగా, అంతర్‌రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న కరుడుకట్టిన దోపిడీ ముఠా గుట్టురట్టు అయింది. బీహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’ సుభోద్ సింగ్ ఈ మొత్తం ఆపరేషన్‌కు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యువెలరీ షాపులో ఈ నెల 3వ తేదీన ఘోర దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు ఆయుధాలతో చొరబడి 101.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాభరణాలను దోచుకెళ్లారు. వీటి మొత్తం విలువ రూ. 82.02 లక్షలుగా పోలీసులు గుర్తించారు. దోపిడీ సమయంలో షాప్ సిబ్బంది ప్రతిఘటించడంతో నిందితులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉద్యోగులు గాయపడ్డారు. బీహార్ జైలులో ఉన్న సుభోద్ సింగ్ ఆదేశాల మేరకు ఈ ముఠా రెండు నెలల క్రితమే తెలంగాణకు చేరుకుంది. జార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో మెహతాబ్ ఖాన్ వద్ద ఒక్కో సిమ్ కార్డును రూ. 10 వేల చొప్పున కొనుగోలు చేశారు. దొంగతనాలకు నకిలీ గుర్తింపు కార్డులు, తప్పుడు పేర్లతో లాడ్జ్‌లలో బస చేయడం ఈ గ్యాంగ్ స్టైల్. ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ జ్యువెలరీ షాపులపై రెక్కీ నిర్వహించారు. చివరకు కరీంనగర్‌లోని పీఎంజే షాప్‌ను లక్ష్యంగా ఎంచుకుని ధర్మపురిలోని ఒక గెస్ట్ హౌస్‌లో బస చేసి దోపిడీకి వ్యూహం రచించారు.

కాల్పుల అనంత‌రం గోదావ‌రి నుంచి ఎస్కేప్‌..!

సుభోద్ సింగ్ అనుచరుల సూచనల మేరకు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాలకు వెళ్లి, అక్కడ నుంచి రైలులో మహారాష్ట్రలోని చంద్రపూర్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, మ్యాగజైన్లు స్వీకరించి ధర్మపురికి తిరిగి వచ్చినట్లు విచారణలో తేలింది. మే 3వ తేదీ ఉదయం నిందితులు రెండు బైక్‌లపై బయలుదేరి వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద బైక్ నంబర్ ప్లేట్లు మార్చారు. ఉదయం 10:50 గంటలకు షాపునకు చేరుకుని, కస్టమర్లలా లోపలికి వెళ్లి సిబ్బందిని తుపాకులతో బెదిరించారు. నగలు దోచుకుంటుండగా సిబ్బంది ఎదురుతిరగడంతో కాల్పులు జరిపి ఒక ఆభరణాల బ్యాగ్‌తో పరారయ్యారు. కంగారులో మరో బ్యాగ్‌ను షాపులోనే వదిలేశారు. అనంతరం గోదావరి నది ఒడ్డున బైక్‌లను వదిలి, నడుచుకుంటూ నది దాటి మంచిర్యాల నుంచి రైళ్లలో వివిధ రాష్ట్రాలకు పారిపోయారు.

వెలిచాల వద్ద నిందితుడి అరెస్ట్.. పోలీసుల హెచ్చరికలు

ఈ కేసులో ప్రధాన నిందితుడైన పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్‌ను మే 13 సాయంత్రం వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇతనిపై వివిధ‌ రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, ఆయుధ చట్టాల కింద ఇప్పటికే 7 కేసులు ఉన్నాయి. మరో ఇద్దరు నిందితులు రావిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమన్ (ఇతనిపై 15 కేసులు ఉన్నాయి), మెహతాబ్ ఖాన్‌లను బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించారు. సాంకేతిక నిఘా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటివరకు ఈ కేసులో 13 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ముగ్గురి వద్ద నుంచి రూ. 51 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ లీడర్ సుభోద్ సింగ్‌తో పాటు పరారీలో ఉన్న మిగిలిన నిందితులు, బంగారం రికవరీ కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జ్యువెలరీ షాపులు, బ్యాంకులు, లాడ్జ్‌ల యజమానులు తప్పనిసరిగా నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు, పానిక్ బటన్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. లాడ్జ్‌లలో సరైన గుర్తింపు కార్డుల ధృవీకరణ తర్వాతే గదులు ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు.