navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 1:53 pm Digital Edition : NAVA GEETAM

ప్రతి పేదవారి కి మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురిలో ఆరోగ్య ఉప కేంద్రం, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ ప్రారంభం

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత

జగిత్యాల/ధర్మపురి, అక్టోబర్15,(నవగీతం):

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

గురువారం ధర్మపురిలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి నూతన ఆరోగ్య ఉప కేంద్రం, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, తాగునీటి పైపులైన్లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోందన్నారు. వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరాన్ని తగ్గించి, ప్రాథమిక వైద్య సేవలను గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.

ధర్మపురిలో నూతన ఆరోగ్య ఉప కేంద్రం అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. మహిళలు, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

పిల్లల ఎదుగుదలకు పార్కులు.. ప్రజల ఆరోగ్యానికి ఓపెన్ జిమ్‌లు

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు చిల్డ్రన్ పార్కులు దోహదపడతాయని మంత్రి తెలిపారు. పిల్లలు ఆటపాటలతో ఆనందంగా గడిపేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎదిగేందుకు పార్కులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పార్కులు, ఓపెన్ జిమ్‌లను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ప్రజలు నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, యువతతో పాటు అన్ని వయస్సుల వారు ఓపెన్ జిమ్‌లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి పైపులైన్ల ప్రారంభంతో స్థానికంగా నీటి సరఫరా మెరుగుపడుతుందని తెలిపారు. సరఫరాలో అంతరాయాలు లేకుండా, పైపులైన్ల నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..

ధర్మపురిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఆరోగ్య ఉప కేంద్రం, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, తాగునీటి పైపులైన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుతాయని తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది విధులు నిర్వహించాలని, గ్రామస్థులకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పార్క్, ఓపెన్ జిమ్‌లను పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఎంహెచ్‌ఓ సుజాత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.