గ్రామ సర్పంచులు,ప్రజాప్రతినిధులు సహకారంతో మరింత పెరుగుదల
నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరగడం పట్ల మండల విద్యాశాఖాధికారి కేతిరి దామోదర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. ఎంపీయూపిఎస్ కుస్తాపూర్ పాఠశాలలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్, ఉపసర్పంచ్ మహీపాల్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాల ఫలితంగా, గతంలో 22 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 152 మందికి చేరుకుంది. అదేవిధంగా ఎంపీపీఎస్ రత్నాపూర్ పాఠశాలలో కూడా విద్యార్థుల నమోదు విశేషంగా పెరిగి, గతంలో 21 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 72 మందికి చేరుకుంది.ఈ రెండు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుదలకు విశేషంగా కృషి చేసిన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను మండల విద్యాధికారి దామోదర్ రెడ్డి సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ, గ్రామ ప్రజాప్రతినిధులు, పాఠశాల అభివృద్ధి కమిటీలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇదే విధమైన సహకారాన్ని అందిస్తే మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు మరింత పెరుగుతుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఇతర సంక్షేమ సౌకర్యాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
