navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 7:34 pm Digital Edition : NAVA GEETAM

బురదమయంగా కోరుట్ల ఆర్టీఏ యూనిట్ కార్యాలయ ఆవరణ

డ్రైవింగ్ టెస్ట్‌కు వచ్చే వాహనదారులకు తప్పని తిప్పలు

కొరుట్ల, సెప్టెంబర్22,(నవగీతం)

కోరుట్ల పట్టణ కేంద్రంలోని ఆర్టీఏ యూనిట్ కార్యాలయ ఆవరణలో రహదారి, డ్రైవింగ్ టెస్ట్ చేసే మైదానం, బురదమయంగా మారి అధ్వానంగా తయారైంది. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారడంతో కార్యాలయానికి రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్‌కు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బైకులు, కార్లతో డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే ప్రాంతంలో బురద, గుంతలు ఏర్పడటంతో వాహనదారులు వాటి మధ్య నుంచి వాహనాలను నడపాల్సి వస్తోంది. దీంతో డ్రైవింగ్ టెస్ట్‌కు వచ్చే వారు బురదమయమైన రహదారి, గుంతలను చూసి ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత అధికారులు స్పందించి ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోని రహదారిని వెంటనే అభివృద్ధి చేసి, గుంతలను పూడ్చి, బురద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. డ్రైవింగ్ టెస్ట్‌కు అనువైన వాతావరణాన్ని కల్పించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.