navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:49 pm Digital Edition : NAVA GEETAM

భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి

శాంతియుతంగా శోభాయాత్ర లు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి ధర్మపురి, రాయపట్నం గోదావరి నది తీరం వద్ద ఏర్పాట్ల పరిశీలన

జగిత్యాల,సెప్టెంబర్22,(నవగీతం) 

భక్తి శ్రద్ధలతో ధర్మపురి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.ధర్మపురి పట్టణం లోని గోదావరి నది, రాయపట్నం గోదావరి నది వద్ద వినాయక నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఇతర శాఖల ఆద్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్క నిర్వాహకులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎటువంటి సంఘటనలు జరగకుండా శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు చేసుకోవాలని కోరారు. 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళికతో వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కావలసిన, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ, మత్స్యశాఖ, అధికారులు సేవలు అందించాలని, నిమజ్జన ప్రదేశాల్లో పారిశుధ్య పనులు చేయించాలని, భారీ క్రేన్లు, చిన్న క్రెన్ లు, గజ ఈతగాళ్ళు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణ వాసులతో పాటు భక్తులు, పిల్లలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జనం వేడుకలు భక్తులందరూ భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ పరిశీలనలోజగిత్యాల ఆర్డీవో మధు సూదన్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి , డిఎస్పీ పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ , తహసీల్దార్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.