కొడిమ్యాల, అక్టోబర్ 17 (నవగీతం):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిత్రలేఖన బోధకుడు ముమ్మాడి రాజకుమార్ మందు గోళీలతో పలు సూక్ష్మ నమూనాలను రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మందు గోళీలతో బతుకమ్మతో పాటు తెలంగాణ రాష్ట్ర నమూనాను అద్భుతంగా తయారు చేశారు.
తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి పూలను పూజిస్తూ, పూలనే దైవ స్వరూపంగా భావించి జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టతను తన కళా నైపుణ్యంతో చాటిచెప్పారు. అతి చిన్న మందు గోళీలను ఉపయోగించి సూక్ష్మ నమూనాలను రూపొందించడం ఆయన సృజనాత్మకతకు, కళా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వినూత్న కళారూపాల ద్వారా ప్రతిబింబిస్తూ, బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటిచెప్పేలా రాజకుమార్ చేసిన ఈ ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంటోంది.