navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 11:02 am Digital Edition : NAVA GEETAM

మల్లాపూర్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలి

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి.. ఎంపీడీఓకు మాజీ ఎంపీటీసీ మోరపు గంగరాజం వినతి

మల్లాపూర్, నవంబర్ 9 (నవగీతం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని గాంధీనగర్ పక్కన, బర్లమందా సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని కాపాడేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీటీసీ మోరపు గంగరాజం కోరారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లాపూర్ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు క్రమంగా కబ్జాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పలువురు ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ వారికి ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో నమోదు కాని పరిస్థితి ఉందని, అలాంటప్పుడు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రజాప్రయోజన భవనాల నిర్మాణానికి స్థలాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని తెలిపారు.

సంబంధిత అధికారులు ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో గుర్తించి, ఆక్రమణలను తక్షణమే అరికట్టాలని, అక్రమంగా పట్టాలు జారీ చేసినట్లు తేలితే వాటిని చట్టప్రకారం రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ భూములకు శాశ్వత రక్షణ కల్పించి, ప్రజా ఆస్తులను కాపాడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణ బాధ్యత అధికారులపై ఉందని మోరపు గంగరాజం స్పష్టం చేశారు.