భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకున్న మహిళలు.. డప్పు చప్పుళ్ల నడుమ ఘనంగా ర్యాలీ
మల్లాపూర్,అక్టోబర్14,(నవగీతం ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సుమారు 100 మంది మహిళలు బోనాలను ఎత్తుకొని స్థానిక హనుమాన్ దేవాలయం నుంచి పాత బస్టాండ్ వరకు డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద కొలువుదీరిన దుర్గామాతకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

పూజా కార్యక్రమాల అనంతరం నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తి భావంతో నిర్వహించిన బోనాల మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వీడీసీ చైర్మన్ సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగ నర్సయ్య, మాజీ చైర్మన్ సంఘ రాజన్న, వైస్ చైర్మన్ తుకారం, విగ్రహ దాత మొరపు జలపతి, పంచలోహ విగ్రహ దాత తోట రాజారం, నాయకులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, ముద్దం సత్యనారాయణ గౌడ్, చంద్రశేఖర్, శంకర్, పుప్పాల మహేష్, మొరపు గంగరాజం, నుతిపెల్లి రాజాం, రుద్ర రాం ప్రసాద్, మోర సతీష్, ఏనుగు వెంకట్ రెడ్డి, మకిలి రాకేష్, ఉయ్యాల లక్ష్మణ్, తోట నారాయణ, కనుక రాజేందర్‌తో పాటు నవదుర్గ సేవా సమితి సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
