ఇబ్రహీంపట్నం ఆగష్టు 20 (నవగీతం):పొట్ట కూటికోసం దుబాయ్ వెళ్లిన ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన జవ్వాజి శ్రీనివాస్, ఇటీవల దుబాయ్ లో మృతి చెందాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి. తల్లిదండ్రుల నీడను కోల్పోయిన నలుగురి చిన్నారులకు మీకు అండగా మేమున్నామంటూ గ్రామస్తులు భరోసా ఇచ్చారు.కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జవ్వాజి శ్రీనివాస్, భార్య కూడా గతంలో మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు,ఇద్దరు కుమారులు,తల్లిదండ్రుల ప్రేమకు దూరమై, చివరకు అనాధలుగా మిగిలారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ నలుగురు పిల్లల పరిస్థితి ని చూసి చలించిన ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన సేవభావం కలిగిన వ్యక్తులు యువకులు, నాయకులు, ఒక్కటయ్యారు. ఆ పిల్లలు ఒంటరివారు కాదు,,, గ్రామం మొత్తం వారికి అండగా ఉంటుంది అనే భరోసాతో తమవంతు సహాయాన్ని అందరూకలసి రూ 1,20,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారులకు భవిష్యత్తుకు కొంతైనా భరోసా కల్పించాలని ఉద్దేశంతో గ్రామస్తులు ముందుకు రావడం పట్ల పలువురు హార్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎలేటి చిన్నరెడ్డి, యువకులు నేమూరి నరేష్, పాశం వీపులు నాయకులు మార బుచ్చన్న, జవ్వాజి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.