navageetam.com
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 4:36 pm Digital Edition : NAVA GEETAM

మొగిలిపేట పాఠశాలలో ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

మల్లాపూర్,అక్టోబర్25, (నవగీతం):

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2001–2002 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదో తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి ఆత్మీయంగా గెట్ టు గెదర్ వేడుకలను జరుపుకున్నారు.

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు, స్వగ్రామానికి తిరిగి సేవ చేయాలనే సంకల్పంతో పూర్వ విద్యార్థులు పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, అతిథులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ గ్రంథాలయం పాఠశాల విద్యార్థులతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కూడా ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, విజ్ఞానాన్ని విస్తరించడం, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారిని ప్రోత్సహించడం గ్రంథాలయ ప్రధాన ఉద్దేశమని పూర్వ విద్యార్థులు తెలిపారు.

గురువులకు ఘన సన్మానం.. పాత జ్ఞాపకాల నెమరువేత

25 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

పాఠశాల అభివృద్ధికి, భావితరాల విద్యార్థుల ప్రయోజనానికి పూర్వ విద్యార్థులు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉపాధ్యాయులు, అతిథులు, గ్రామస్థులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు రహిమాన్, బాపూరావు, సురేష్, పద్మాకర్ రావు, శ్రీనివాస్ సార్, మురళి, రాందాస్ సార్, వెంకటరమణారెడ్డి, స్వామి, నర్సారెడ్డి, మల్లయ్యతో పాటు ఎస్‌ఎస్‌సీ 2001–2002 పూర్వ విద్యార్థుల బృందం పాల్గొన్నారు.

స్నేహబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు, భావితరాల విద్యార్థులకు ఉపయోగపడే గ్రంథాలయాన్ని అందించిన సేవా కార్యక్రమంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.