వర్షాల కోసం ధర్మపురి క్షేత్రంలో వరుణ యాగం
ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి
నవగీతం,జగిత్యాల/ధర్మపురి:
రాష్ట్రంలో వర్షాభావ నేపథ్యంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురియాలని ధర్మపురి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి లక్ష్యం అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ధర్మపురి క్షేత్రంలో వర్షాల కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ఆలయ సిబ్బందికి అర్చకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
