navageetam.com
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 11:55 am Digital Edition : NAVA GEETAM

వెంకటాపురంలో మండల మహిళా సమాఖ్య 18వ వార్షిక మహాజనసభ

నూగురు వెంకటాపురం,సెప్టెంబర్ 30,(నవగీతం)ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో మహిళా సమాఖ్య 18వ వార్షిక మహాజనసభ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, డీఆర్డీఏ ద్వారా చేపట్టే ప్రగతి నివేదికపై సమీక్షించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, 2026-27 చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సామాజిక పెట్టుబడి నిధి (సీఐఎఫ్) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేసింది. దీని ద్వారా సంఘ సభ్యులు తీసుకున్న రుణాలతో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరచుకొని ఆదాయం పెంచుకోవాలని, సకాలంలో సక్రమ పద్ధతిలో రికవరీ చేయాలని తెలిపారు.
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ మాట్లాడుతూ వెంకటాపురం మండల మహిళా సమాఖ్యకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తుందని, దీనిలో భాగంగా మహిళా సంఘ సభ్యురాలు సహజ కాలం చెందితే రెండు లక్షల వరకు లోన్ బీమా, ప్రమాదవశాత్తు మరణించినట్లయితే 10 లక్షల వరకు ప్రమాద బీమా అందిస్తుందని, అలానే వడ్డీ లేని రుణం 10 లక్షలు బ్యాంకు లోన్ కు వర్తింప చేస్తున్నారని తెలిపారు.
తీసుకున్న రుణాలు మహిళా సంఘ సభ్యులు జీవనోపాధి పెంచుకునే విధంగా ఉండాలని, దాని ద్వారా కుటుంబ ఆదాయం పెరగడం, వారి జీవన పోషణ సక్రమంగా ఉండుట వలన ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటి సరస్వతి, మండల పంచాయతీ అధికారి బొగ్గ నారాయణ, మండల విద్యాశాఖాధికారి జీవీపీ సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ కాల్వా అప్పారావు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.