నీరు విడుదల చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం
కోరుట్ల / మల్లాపూర్,(నవగీతం):
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP) నుండి తక్షణమే నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు రైతుల పంటలను కాపాడాలని బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ బోయిని హన్మాండ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో సరైన వర్షాలు లేక రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మల్లాపూర్ మండలంలోని పాతదామరాజుపల్లి, కొత్తదామరాజుపల్లి, వాల్గొండ, సంగం, శ్రీరాంపూర్, వి.వి.రావుపేట్, గొర్రెపల్లి తదితర చివరి ఆయకట్టు గ్రామాల్లో వరి పంటలు చివరి దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం నీరు అందక పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కీలక సమయంలో సాగునీరు అందించకపోతే రైతులు కోలుకోలేని విధంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోతారని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, గ్రామాల్లోని చెరువులు, కుంటలు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పశువులకు సైతం తాగునీరు దొరకని దుస్థితి నెలకొందన్నారు.
రైతుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్సారెస్పీ నుంచి చివరి ఆయకట్టు వరకు నీటిని పారించాలని కోరారు.
ఈ తీవ్ర సమస్యను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్, కొమిరెడ్డి విజయ్ ఆజాద్‌ల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై వారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో చర్చించి రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయకపోతే రైతుల పక్షాన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కొమిరెడ్డి కరంచంద్‌ను కోరినట్లు బోయిని హన్మాండ్లు స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా పోరాడుతుందని స్పష్టం చేశారు.