జగిత్యాల కలెక్టరేట్ లో ఘనంగా జయంతి వేడుకలు
పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల,ఆగష్టు18,(నవగీతం):జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాన్య కుటుంబంలో జన్మించి, తన కాలంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుడిగా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు.పాపన్న కేవలం ఒక యుద్ధ వీరుడు కాదు. కోటలను జయించిన సైనిక నాయకుడిగా మాత్రమే ఆయనను చూడటం ఆయన చారిత్రక ప్రాధాన్యతను పరిమితం చేయడమే అవుతుంది. గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తిగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను సమీకరించి, అప్పటి ఆధిపత్య వ్యవస్థలను సవాలు చేసిన ప్రజా నాయకుడిగా ఆయన తెలంగాణ ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన గాథలో ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా భాగస్వామ్యం, అధికారంలో భాగస్వామ్యం వంటి విలువలు అంతర్లీనంగా కనిపిస్తాయి.17వ శతాబ్దంలోనే సామాజికంగా వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజలను ఏకం చేసి తన పోరాటానికి పునాది వేసిన పాపన్న… అధికారం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండాల్సిన అవసరం లేదని తన కార్యాచరణ ద్వారా చాటిచెప్పిన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.ఈసందర్బంగా ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. ఎస్ లత, బి. రాజ గౌడ్, డి ఆర్ వో ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.
