navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 December 2025, 1:21 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవగీతం, కరీంనగర్

కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1885లో స్థాపితమైన కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసిన చారిత్రక పార్టీ అని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి మహానేతల నాయకత్వంలో దేశాన్ని ముందుకు నడిపించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, వ్యవసాయ విస్తరణ, సామాజిక న్యాయం వంటి రంగాల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు.అనంతరం నగరంలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్లలో కార్యాలయాలు ప్రారంభించి పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యకర్తలు పని చేయాలని, రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో నాయకులు అంజన్ కుమార్, మేడిపల్లి సత్యం,కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పలు డివిజన్ల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.