navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 9:24 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

కొండగట్టు అగ్నిప్రమాద బాధితులకు రూ.1కోటి 12 లక్షల పైగా ఆర్థిక సాయం

నవగీతం,చొప్పదండి

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు దిగువ ప్రాంతంలో గత నవంబర్‌ 29న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన 31 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.83,12,000/-తో పాటు విద్యుత్ శాఖ ద్వారా రూ.29,00,000/- విలువైన చెక్కులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ చెతుల మీదుగా బాధితులకు పంపిణీ చేశారు.అదేవిధంగా మహిళా శక్తి, శ్రీనిధి స్కీమ్‌ల ద్వారా ఐదుగురు మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. గతంలో అగ్నిప్రమాదాలు, కరెంట్ షాక్ ఘటనల్లో బాధితులకు నామమాత్రపు పరిహారాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కానీ కొండగట్టులో సర్వం కోల్పోయిన బాధితులకు లక్షల రూపాయల పరిహారం అందించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం జీవోలు జారీ చేసి పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సాంఘిక సంక్షేమ శాఖమాత్యులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రమాదంలో నష్టపోయిన బాధితులను తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం సహాయ నిధి, విద్యుత్ శాఖ, మహిళా సంఘాల ద్వారా కలిపి భారీ మొత్తంలో చెక్కులు పంపిణీ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలా కొండగట్టును కూడా త్వరలో టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.