నవగీతం, కోరుట్ల
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను ఎస్పీ గారు సవివరంగా పరిశీలించి, రికార్డుల నిర్వహణపై తగిన సూచనలు చేశారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలని, ప్రజలకు పోలీసుల అందుబాటు మరింత పెరగాలని ఆదేశించారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు, సైబర్ అవగాహన ప్రజలతో మరింత సత్సంబంధాలు పెంచుకోవాలని, ముఖ్యంగా యువతకు సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ సమయంలో చాలా మంది స్వగ్రామాలకు వెళ్లడం వల్ల ఇళ్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందని, ఈ పరిస్థితిని దొంగలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉన్నందున, పటిష్టమైన పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలు జరగకుండా చూడాలని ఎస్పీ గారు ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, కోరుట్ల మెట్‌పల్లి సీఐలు సురేష్, అనిల్ కుమార్, ఎస్‌ఐ చిరంజీవి ఉన్నారు