శివప్రసాద్ మృతి పట్ల టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంతాపం
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
నవగీతం,పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సీనియర్ రిపోర్టర్ బాలే శివ ప్రసాద్ (45) ఆకస్మిక మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.మండలంలోని ఉషన్నపల్లె గ్రామానికి చెందిన ఆయన ఆదివారం తెల్లవారుజామున నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే శివప్రసాద్ తుదిశ్వాస విడిచారు. కాగా మరణానికి కేవలం ఒకరోజు ముందు ఆయన స్థానికంగా జరిగిన ఒక క్రికెట్ టోర్నమెంట్‌ను ఉత్సాహంగా ప్రారంభించి, స్నేహితులతో సరదాగా గడపడం గమనార్హం.అంతలోనే ఆయన మరణవార్త వినాల్సి రావడంతో స్థానికులు,తోటి జర్నలిస్టులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల టీయూడబ్ల్యూజే-ఐజేయూ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ స్పందిస్తూ శివప్రసాద్ కుటుంబానికి యూనియన్ అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. శివప్రసాద్ ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్,పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లవర్జల వంశీ,ప్రదాన కార్యదర్శి నారాయణదాసు అశోక్,పెద్దపల్లి పట్టణ,మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరమల్ల విద్యాసాగర్ రావు,ఆకుల రమేష్ సంతాపం వ్యక్తం చేశారు.