navageetam.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 8:26 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

గెలుపు గుర్రాలకే టిఆర్‌పి టికెట్లు

కత్తెర గుర్తుతో మున్సిపల్ ఎన్నికల బరిలోకి అభ్యర్థులు

టిఆర్‌పి సీనియర్ నాయకుడు గుండవేణ స్వామి

నవగీతం,పెద్దపల్లి:

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో పెద్దపల్లి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు గుండవేణ స్వామి ప్రకటించారు.జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా మంథని,పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలలోని అన్ని కార్పొరేటర్ మరియు కౌన్సిలర్ స్థానాలకు గెలుపు గుర్రాలకే పార్టీ బి-ఫారాలు అందజేస్తుందని, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.గురువారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, ఉద్యమకారులు, యువత మరియు మేధావులు ఈ ఎన్నికల్లో పోటీకి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను, ముఖ్యంగా బీసీలను మోసం చేశాయని విమర్శించారు.బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ నటిస్తోందని,కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం రిజర్వేషన్ల అంశంలో బీసీలను వంచిస్తోందని మండిపడ్డారు.ప్రజలను మోసం చేస్తున్న ఈ అగ్రకుల పార్టీలకు బుద్ధి చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వారిని ఓడించాలని ఆయన కోరారు.కత్తెర గుర్తుపై పోటీ చేసే టిఆర్‌పి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారానే బీసీ,ఎస్సీ,ఎస్టీ మరియు పేద వర్గాలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని స్వామి పేర్కొన్నారు.బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ,రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జిల్లా ప్రజలు కీలక పాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.