navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 3:44 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి పిల్లల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలి – టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్

నవగీతం, తిరుపతి

అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను, నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు,ఆపరేషన్ యంత్రాలు, ఫర్నీచర్, విద్యుత్ , తదితర మౌళిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న జీ + 6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలు, పరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్ లో ఏ ఏ అంతస్తును ఉపయోగిస్తున్నారని, ప్రతి ఫ్లోర్ ను పరిశీలించారు. 6వ ఫ్లోర్ లో పూర్తిగా ఆపరేషన్ ల కోసం వినియోగించనున్నట్లు, 7వ ఫ్లోర్ కేవలం హెలిపాడ్ కోసం ఉపయోగించనున్నట్లు వైద్యులు డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి వివరించారు. ఆసుపత్రిలో అక్కడక్కడా భక్తిభావం, మనోధైర్యాన్ని రోగులకు, వారి సంరక్షకులకు నింపేలా ఆసుపత్రి గోడలకు దేవతామూర్తుల చిత్రాలను అమర్చాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా నూతన ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అంతకుముందు శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల  ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టిటిడి ఈవో మాట్లాడి  ఆన్ లైన్ నమోదు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయా, ఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు. శ్రీపద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి అందిస్తున్న వైద్యసేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ ఎన్. శ్రీనాథ్  రెడ్డి టిటిడి ఈవోకు వివరించారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు,  23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. అనంతరం ఐసియూ – 1లోని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు ఉన్న రంద్రాలను సరిచేసే క్యాత్ ల్యాబ్ మిషన్ ను, ఐసియూ -2లోని ఐసోలేషన్ గదిని, ఐసియూ – 3, జనరల్ వార్డులలో చికిత్స పొందిన చిన్నారులను పరిశీలించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలం అందిస్తున్న సేవలను పిల్లల సంరక్షకులతో మాట్లాడారు. కడపకు చెందిన 3 నెలల చిన్నారి కిషోర్ కు మంచి రక్తం, చెడు రక్తం గుండెలో వేర్వేరుగా వెళ్లాల్సి ఉండగా, ఒకేచోట కలుస్తుండడంతో శస్త్ర చికిత్స చేసి మంచి రక్తం, చెడు రక్తం వేర్వేరుగా వెళ్లేలా వైద్యం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఈ టి వి సత్యనారాయణ, ఎస్ఈ వేంకటేశ్వర్లు, మనోహరం, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్.ఎం.వో డా.భరత్, వైద్యులు, తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.