నవగీతం, మెట్ పల్లి
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా (నైలాన్ / సింథటిక్ దారాలు) విక్రయాలు జరుగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్కాలిక విక్రయ కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేశారు. నిషేధిత చైనా మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.చైనా మాంజా వల్ల మనుషులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు, చిన్నారులకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని, అలాగే పక్షులు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. గతంలో చోటుచేసుకున్న ప్రమాదాలు, ప్రాణనష్టాల నేపథ్యంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు. ప్రజలు నిషేధిత చైనా మాంజాను కొనుగోలు చేయకుండా సహకరించాలని, ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు గానీ, నిల్వ ఉంచినట్లు గానీ సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు