navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 10:05 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పాలితం సర్పంచ్‌పై అనుచిత వ్యాఖ్యలు

అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులపై గ్రామస్తుల ఆగ్రహం

నవగీతం,పెద్దపల్లి:

పెద్దపల్లి మండలం పాలితం గ్రామ సర్పంచ్ వేలిచాల రాజయ్య గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా,ప్రశ్నించిన గ్రామస్తులపై తిరిగి అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.ఈ ఘటనపై మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రతినిధులు మరియు పాలితం గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించి అసలు నిజాలను వెల్లడించారు.గ్రామ సర్పంచ్ రాజయ్య గౌడ్ దొంగలకు సపోర్ట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్త బసల్లి నరేష్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైందన్నారు.ఈ క్రమంలో నరేష్ భార్య అరుణ,గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌ను ఉద్దేశించి నడిరోడ్డుపై బూతులు తిడుతూ,అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా తప్పుబట్టారు. సర్పంచ్‌ను అలా దూషించడం పద్ధతి కాదని ప్రశ్నించడానికి గ్రామస్తులు ఆమె ఇంటికి వెళ్లగా,అరుణ మరియు నరేష్ కుటుంబం దీనిని కుల దూషణగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని గ్రామస్తులు తెలిపారు. తమపై గొడవకు వచ్చారని ఆరోపిస్తూ,సర్పంచ్ తోపాటు గ్రామస్తులందరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపించారు.ఈ విషయంపై ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రచార కార్యదర్శి బసెల్లి నారాయణ మాట్లాడుతూ రాజకీయ కక్షలతో గ్రామంలో కులాల మధ్య చిచ్చు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు.కేవలం ప్రశ్నించినందుకు అట్రాసిటీ కేసుల పేరుతో భయపెట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని మండిపడ్డారు.సర్పంచ్‌ను దూషించిన వారు క్షమాపణ చెప్పాల్సింది పోయి,కుల రంగు పులమడం రాజ్యాంగబద్ధమైన చట్టాలను కించపరచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పాలితం గ్రామ ప్రజలు జంజర్ల మల్లిక,రెడ్డిమల్ల లక్ష్మి,సటు సౌందర్య,జంజర్ల లక్ష్మి,కొప్పుల సంపత్,కొప్పుల ఆదర్శ్, మామిడిపల్లి రవి, ఈదునూరి శ్రీనివాస్,జంజర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.