నవగీతం,వైరా:
మహిళల అభ్యున్నతికి అవరోధంగా ఉన్న మనువాదాన్ని వ్యతిరేకిద్దామని, మహిళల హక్కుల కోసం ఐక్యంగా పోరాడుదామని ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనువాద ప్రతులను బోగి మంటల్లో వేసి దగ్దం చేశారు. అనంతరం ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి తోట కృష్ణవేణి అద్యక్షతన జరిగిన సభలో మాచర్ల భారతి, మెరుగు మాట్లాడుతూ బీజేపీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు పేరుతో మహిళలను వంటింటికి పరిమితం చేయాలనే బిజేపి దురాలోచనను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మహిళలు తమ హక్కులు, విద్య, సంక్షేమం, భద్రత కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో జనవరి 25 నుంచి 28 వరకు జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, జనవరి 25న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగే బహిరంగ సభకు మహిళలు భారీగా కదిలి వచ్చి ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, నాయకులు చింతనిప్పు సులోచన, కంసాని మల్లికాంబ, బొంతు సమత, మాదినేని రజిని, తోట పద్మావతి, బత్తుల ప్రమీల, భూక్యా విజయ, చావా కళావతి, తాటి కృష్ణ కుమారి, బందెల అమృతమ్మ, మాడపాటి సుజాత, కట్ల ఆశ, మాదినేని భవిష్య, భూక్యా ఉషాశ్రీ, భూక్యా సృజనశ్రీ, బండారు మేఘన, బండారు సింధు తదితరులు పాల్గొన్నారు