navageetam.com
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 1:18 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ఒగ్గు వైభవం

ఢిల్లీ పరేడ్‌కు పెద్దపల్లి కళాకారుడు శివయ్య ఎంపిక

నవగీతం, పెద్దపల్లి

ఢిల్లీలో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ జానపద కళా వైభవం ప్రతిబింబించనుంది. సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన 30 మంది ఒగ్గుడోలు కళాకారుల బృందంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన బొప్పనపల్లి శివయ్యకు చోటు దక్కింది. జనగామ జిల్లా మాణిక్యపురం గ్రామానికి చెందిన డాక్టర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి నేతృత్వంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుండి అత్యుత్తమ కళాకారులను ఎంపిక చేయగా,అందులో శివయ్య ఒకరు.వీరంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకుని,ఈ నెల 25 వరకు అక్కడ నిర్వహించే రిహార్సల్స్‌లో పాల్గొంటారు.అనంతరం 26న ఢిల్లీలోని ప్రతిష్టాత్మక కర్తవ్యపథ్ వేదికగా జరిగే పరేడ్‌లో తమ ఒగ్గుడోలు విన్యాసాలతో దేశ ప్రజలను అలరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చే తమ కళకు తొలిసారిగా ఢిల్లీ పరేడ్‌లో అవకాశం రావడం పట్ల శివయ్య హర్షం వ్యక్తం చేస్తూ,ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన గురువులు డాక్టర్ ఒగ్గు రవి,సాయిల్ల మల్లేశం,కుంట సదయ్య,బొప్పనపల్లి ఐలయ్యలతో పాటు తన గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.