navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 4:11 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

రైతు ముంగిట సంక్రాంతి వైభవం

రాఘవపూర్ లో కన్నుల పండువగా కాట్రేవుల పండు

నవగీతం,పెద్దపల్లి

పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం భోగి పండుగను పురస్కరించుకుని గ్రామంలో పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ ఎద్దుల పోటీలు మరియు కాట్రేవుల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో,ఉత్సాహంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తడిచెట్టి చామంతి-శ్రీకాంత్ ఎద్దుల పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ మన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గ్రామంలోని పాడి పశువులన్నీ ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు పండించే పంటలు మంచి దిగుబడిని ఇచ్చి గ్రామమంతా సుభిక్షంగా ఉండాలనేదే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.అనంతరం గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు,పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించే రైతులు కాట్రేవుల పండుగను ఘనంగా జరుపుకున్నారు.రైతులు తమ పశువులను చెరువులు,కుంటల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగి,వాటి కొమ్ములకు ఆకర్షణీయమైన రంగులు వేశారు.మెడలో గంటలు, పూలమాలలతో పశువులను అందంగా అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు.అనంతరం పొలాల వద్ద మరియు గ్రామ సరిహద్దుల్లో కాట్రేవుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పశువులకు ఎటువంటి రోగాలు రాకుండా పశుసంపద వృద్ధి చెందాలని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు,యువకులు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో రాఘవపూర్ గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.