నవగీతం, జగిత్యాల
జగిత్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాస వారోత్సవాలలో భాగంగా, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ (డీటీఓ) అధికారి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి కీలక భద్రతా సందేశం అందించారు.
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో, విద్యార్థులు కూడా ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఆందోళనకరమని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, రోడ్డు దాటేటప్పుడు నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి కారణాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితం అమూల్యమైనదని, వారు దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ.. రోడ్డు ఉపయోగించే సమయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీబ్రా క్రాసింగ్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, ఎడమ వైపు నడవడం, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వంటి నియమాలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. “ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు” అని హెచ్చరిస్తూ, రోడ్డు భద్రతను జీవితంలో భాగంగా మార్చుకుని కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. జగిత్యాల జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు రోడ్డు భద్రత దూతలుగా మారి అవగాహనను మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎంవీఐలు వెంకన్న, అభిలాష్ రియాజుద్దీన్, పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు జానకి, రాము, కవితతో పాటు విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు.