చైర్మన్ రేసులో మాజీ జడ్పీటీసీ
నవగీతం,వైరా:
వైరా మున్సిపాలిటీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం నెలకొంది. ఇటీవల వరకు స్తబ్దతగా ఉన్న బొర్రా కుటుంబం మున్సిపాలిటీ ఎన్నికల బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్క్ ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సతీమణి మాజీ జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి కాంగ్రెస్ నుంచి చైర్మన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. వైరా మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని బొర్రా ఉమాదేవి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. గత ఐదు దశాబ్దాలుగా వైరా రాజకీయాల్లో బొర్రా కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. 1987 నుంచి 1992 వరకు బొర్రా భద్రయ్య వైరా ఎంపీపీగా పనిచేశారు. భద్రయ్య కోడలు బొర్రా పద్మావతి 1995 నుంచి 2000 వరకు వైరా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా భద్రయ్య కుమారుడు బొర్రా వెంకటేశ్వర్లు 2006 నుంచి 2011 వరకు వైరా మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా పనిచేశారు. బొర్రా రాజశేఖర్ సతీమణి బొర్రా ఉమాదేవి 2014 నుంచి 2019 వరకు వైరా జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహించారు. 2020 సంవత్సరంలో వైరా సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బొర్రా రాజశేఖర్ 2023 వరకు మార్క్ ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ గా పనిచేసారు. 2020 నుంచి 2025 వరకు డీసీసీబీ డైరెక్టర్ గా కూడా ఆయన కొనసాగారు. వైరా నియోజకవర్గంలో 2019, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేల గెలుపుకు ఆయన విశేష కృషి చేశారు. ఓసి జనరల్ మహిళకు రిజర్వ్ అయిన వైరా మున్సిపాలిటీ చైర్మన్ రేసులోకి బొర్రా ఉమాదేవి అనూహ్యంగా రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.