నవగీతం, నిజామాబాద్
నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం సీపీ టీం వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ మ్యాచ్ లో పోలీస్ కమిషనర్ ఎలెవన్ టీం ఘన విజయం సాధించింది.టాస్ గెలిచిన పోలీస్ టీం బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. పోలీస్ టీం తరఫున ఎస్ఐ కిరణ్ పాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించి 96 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట రెడ్డి 25 పరుగులు చేశారు.లక్ష్య చేధనకు దిగిన ప్రెస్ క్లబ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., 3 ఓవర్లు బౌలింగ్ చేసి ప్రతి ఓవర్ లో ఒక వికెట్ చొప్పున మొత్తం 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అదనపు డీసీపీ జి. బస్వా రెడ్డి ఒక ఓవర్ వేసి ఒక వికెట్ తీశారు. ప్రెస్ క్లబ్ జట్టు తరఫున శివ ఠాగూర్ 24 పరుగులతో పోరాటం చేశారు.ఈ మ్యాచ్ లో పోలీస్ టీం 43 పరుగుల తేడాతో ప్రెస్ క్లబ్ జట్టుపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఉత్తమ బ్యాట్స్మన్ గా ఎస్ఐ కిరణ్ పాల్, ఉత్తమ బౌలర్ గా శ్యామ్ సుందర్ లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, అదనపు కలెక్టర్ శ అంకిత్ బహుమతులతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసిపి రాజా వెంకట రెడ్డి, సీఐలు, ఎస్సైలు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.