చైర్మన్ రేసులో దివ్య కిషోర్ రెడ్డి..?
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు మెట్ పల్లి మున్సిపల్ ఫలితాలు విడుదలవుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన కొందరు అభ్యర్థులు విజయం దిశగా కొనసాగుతున్నారు. అందులో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని అయిదో వార్డు అయిన ఆరపేటలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపిడి కవిత పైన ఘన విజయం సాధించారు. దివ్య కిషోర్ రెడ్డికి 825 ఓట్లతో విజయం సాధించగా కవిత 454 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ తరఫున పోటీచేసిన మానస 116 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అత్యధిక ఓట్లు వచ్చిన పూడుకారం దివ్య కిషోర్ రెడ్డిని ఎన్నికల అధికారులు విజేతగా ప్రకటించారు.
రైతు కుటుంబం నుంచి వచ్చి…
ఆరపేట బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి వాళ్ళది రైతు కుటుంబం. సాదాసీదా జీవనం గడిపిన వారు. దివ్య వాళ్ళ అమ్మ అంజమ్మ ఆరపేట గ్రామ చివరి సర్పంచ్ గా సేవలందించారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆరపేట గ్రామాన్ని మెట్ పల్లి మున్సిపల్ లో విలీనం చేశారు. అప్పటి నుండి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రెండోసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ గా ఘనవిజయం సాధించారు.
చైర్మన్ రేసులో దివ్య కిషోర్ రెడ్డి…?
ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో అయిదో వార్డు ఆరపేట బీజేపీ కౌన్సిలర్ గా పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే స్థానిక బీజేపీ పెద్దలు, పార్టీ అధిష్టానం ఆశీస్సులు అందితే మున్సిపల్ చైర్మన్ రేసులో ఉంటున్నట్లు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. కాలం కలిసి వచ్చి అన్ని కుదిరితే మున్సిపల్ చైర్ పర్సన్ గా పుడుకారం దివ్య కిషోర్ రెడ్డి ఎన్నిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న సమాచారం ఉంది. మరో రెండు, మూడు రోజులు గడిస్తే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది