navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 3:08 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఆర్‌టీఐ అమలులో నిర్లక్ష్యం వద్దు

రాష్ట్ర సమాచార కమిషనర్లకు యుఎఫ్ఆర్టీఐ ప్రతినిధుల వినతి

నవగీతం ,పెద్దపల్లి:

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని,దరఖాస్తుదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని యునైటెడ్ ఫోరం ఆర్‌టీఐ క్యాంపెయిన్ నాయకులు రాష్ట్ర సమాచార కమిషనర్లను కోరారు.బుధవారం పెద్దపల్లి జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు,దశరథ భూపాల్,మోహిసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలను ఎన్టీపీసీ సింగరేణి ఇల్లందు గెస్ట్ హౌస్‌లో యుఎఫ్ఆర్టీఐ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కమిషనర్లను శాలువాలతో ఘనంగా సన్మానించి,2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.అనంతరం జిల్లాలో ఆర్‌టీఐ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిషనర్లకు వినతిపత్రం సమర్పించారు.జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు 30 రోజుల గడువులోపు సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నారని, అసంపూర్తి వివరాలతో దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.తగిన కారణం లేకుండానే సెక్షన్ 8,9 కింద దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని,సమాచారం అడిగినందుకు కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారని కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు.చట్టం ప్రకారం దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో యుఎఫ్ఆర్టీఐ రాష్ట్ర ఆర్గనైజింగ్ కన్వీనర్ ఎస్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ ఎస్.సామ్రాజ్యలక్ష్మి, జిల్లా కన్వీనర్ జంగ చక్రధర్ రెడ్డి,కో-కన్వీనర్ ఎస్.నాగేశ్వర్, జిల్లా ఆర్‌టీఐ ఉద్యమకారుడు ఆరెల్లి మల్లేష్,జూలపల్లి మండల కన్వీనర్ వొల్లె తిరుపతి, రాజేశం,గుర్రాల చంద్రమౌళి, జి.చిరంజీవి,సురేష్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.