నవగీతం,మెట్ పల్లి:
మెట్ పల్లి మండలం బండ లింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్య బోధన విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల పాఠ్యంశాల్లోని సెలబస్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారితో పాఠాలు చదివించి వారి భోదన స్థితి గతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆకాక్షించారు. పదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్టు నోట్ బుక్‌లను పరిశీలించారు. పదో తరగతి పరీక్షలకు రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్కులు వస్తాయని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో ఏమి అవ్వాలని ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకొని చదువుకుంటే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేసి ప్రోత్సాహించారు. అనంతరం యం పి పి ఎస్ పాఠశాలలోని 3వ తరగతి ఎఫ్ ఎల్ ఎన్ పై పలు ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్నం భోజనంలో సన్నబియ్యం వాడాలి, వంటకాల కోసం గ్యాస్ సిలిండర్ లను ఉపయోగించే విధంగా చూడాలి, ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు వైద్య పరీక్షలు సకాలంలో చేయాలి.ప్రభుత్వ మెను ప్రకారం రోజువారి వంటకాలు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందే విధంగా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
