navageetam.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 1:33 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి: రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, భద్రతపై వీడియో కాన్ఫరెన్స్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ పాత్ర, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు(MCC), పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, క్రిటికల్ సున్నిత ప్రాంతాలపై పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ బాధ్యతలు అత్యంత కీలకమని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నేరస్తులు, ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులు, పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులను గుర్తించి బైండోవర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీల వివరాలు, సమస్యాత్మక మరియు అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, గ్రామాల వివరాలపై సంబంధిత అధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని అన్నారు. ప్రతి అధికారి తన పరిధిలో పరిస్థితులపై స్పష్టమైన సమాచారం కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయాలని, డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు సంబంధించిన అక్రమ రవాణా పంపిణీపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌కు ముందు , పోలింగ్ రోజున అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహించాలని తెలిపారు.అలాగే, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య వార్తలపై సైబర్ విభాగం ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా బందోబస్తు ఏర్పాటు చేసి, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పూర్తి భద్రత కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొని, జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్ల వివరాలను డీజీపీ కి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎస్పీ రఘు చందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు