జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
మున్సిపల్ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, మున్సిపల్ ఎన్నికలు ఉన్న పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ పాత్ర, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠిన అమలు, పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లు, క్రిటికల్ మరియు సున్నిత ప్రాంతాల పర్యవేక్షణ, పోలింగ్ రోజు తీసుకోవలసిన ముందస్తు భద్రతా చర్యలు, అలాగే ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 136 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబడనున్నాయని, ఇందుకోసం 379 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అక్రమ మద్యం, నగదు, ఉచితాల పంపిణీ వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి అధికారి తమ మున్సిపల్ పరిధిలో ఉన్న పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ కేంద్రాలు, రూట్ మొబైల్ బందోబస్తు వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌ల వద్ద తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు, అదనపు బలగాల మోహరింపు వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఎన్నికల సందర్భంగా గతంలో నేరాలకు పాల్పడిన నేరస్తులు, రౌడీ షీటర్లు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి బైండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, అనిల్ కుమార్, సురేష్, కరుణాకర్, రామ్ నరసింహా రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సైదులు, వేణు, అలాగే ఎస్‌ఐలు పాల్గొన్నారు.