navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 7:41 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలి

ప్రభుత్వాన్ని కోరిన మాజీ సర్పంచ్ కృష్ణారావు

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పరిధిలోని హిమ్మత్‌రావుపేట గ్రామపంచాయతీలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని హిమ్మత్ రావు పేట గ్రామ మాజీ సర్పంచ్ పునుగోటి కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు.నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ), ప్రత్యేక అభివృద్ధి నిధులు (డీఎంఎఫ్‌టీ), 15వ ఆర్థిక సంఘం నిధులు, జిల్లా ఖనిజ నిధులు (ఎంపీటీ) ద్వారా మహిళా భవనం, రజక సంఘ భవనం, పద్మనాయక భవనం, గౌడ సంఘ భవనం, ముదిరాజ్ సంఘ భవనం, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, శాలివాహన సంఘ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రం, శాఖా గ్రంథాలయ భవనాల నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఈ పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డు నమోదు చేసిన అనంతరం 2024 ఏప్రిల్‌లో చెక్కులు జారీ చేయగా, అవి జగిత్యాల సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జమ చేసినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత కాంట్రాక్టర్ల ఖాతాల్లో నిధులు జమ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఫ్లడ్ మరియు ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాల కింద కూడా గ్రామపంచాయతీ పరిధిలో పనులు జరిగాయని, అన్ని పనులకు కలిపి దాదాపు రూ. కోటి పైగా బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం పెద్ద కాంట్రాక్టర్లు, సంస్థలకు వేల కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్లు వడ్డీల భారంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.కాబట్టి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని మాజీ సర్పంచ్ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.