navageetam.com
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 12:16 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు – ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మెట్‌పల్లి చెక్‌పోస్ట్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ

నవగీతం,మెట్ పల్లి:

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మెట్‌పల్లి పట్టణంలోని చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ  ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న వాహన తనిఖీలను పరిశీలించారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, అక్రమ నగదు, మద్యం, ఉచిత పంపిణీలు, ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని తెలిపారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమానాస్పద వాహనాలు, అక్రమ నగదు, మద్యం తదితర నిషేధిత వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.సరైన ఆధారాలు లేకుండా భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తే సీజ్ చేయడం జరుగుతుందని, అత్యవసర అవసరాల కోసం నగదు తీసుకెళ్తే తగిన బిల్లులు, సంబంధిత పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా అన్ని కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర వాహన తనిఖీలు కొనసాగుతాయని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ  కోరారు. జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐ కిరణ్ కుమార్ చెక్‌పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.