నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్స్‌లను పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు తెలిపారు.స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితో 24 గంటల పహారా ఏర్పాటు చేసి మల్టీ-లేయర్ భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోందని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం శాంతియుతంగా ముగియడంలో ప్రజలు, ఎన్నికల అధికారులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఎస్పీ ప్రశంసించారు. ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ ముగియడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందికి మరియు అధికారులకు అభినందనలు తెలిపారు. అలాగే ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.