నాణ్యమైన విద్యతో ప్రభుత్వ గురుకులాలకు పెరుగుతున్న ప్రజాదరణ
సోషల్ జస్టిస్ డే వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
నవగీతం,మధిర:
పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం మధిర నియోజవర్గం ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ముందుగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, విద్యార్ధినిలతో కలిసి కలెక్టర్ సామాజిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజంగా తెలంగాణలో నిర్మించే దిశగా ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వేను విజయవంతంగా నిర్వహించి, రిపోర్టును ఫిబ్రవరి 4, 2025న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిందని అన్నారు. కుల, మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు.

గురుకులాల్లో చదివే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలను 40 శాతం పెంచడం జరిగిందని, పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించడం కోసం సమీకృత గురుకులాల నిర్మాణం చేపట్టిందని అన్నారు. సామాజిక న్యాయం ఉన్న సమాజాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వినియోగించుకుంటూ పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకుంటే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి విద్యాసంస్థలు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులకు అవసరమైన డైట్, కాస్మొటిక్ ఛార్జీలు, ఇతర మౌళిక వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు.

ప్రభుత్వ గురుకులాలకు ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉందని అన్నారు. మంచి విద్యాసంస్థల్లో నేడు పిల్లలు చదువుతున్నా రని, అనేక ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ల్యాబ్, క్రీడలు ఆడేందుకు వసతులు మన గురుకులాల వద్ద ఉన్నాయని తెలిపారు. పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు మనం ఇచ్చే అతి పెద్ద బహుమతి అవుతుందని, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో రిగ్రెట్ ఫీల్ కాకుండా ఉండాలని అన్నారు. చదువు, క్రీడలు, మనం చేసే పనిలో పిల్లలు తమ ఎనర్జీనీ 100 శాతం అందించాలని అన్నారు. విజయం వెంటనే రాదని, అనేక ఓటములు, అడ్డంకులను అధిగమిస్తేనే మంచి విజయం సాధ్యం అవుతుందని అన్నారు. రాబోయే 10, ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటి చైర్మెన్ బండారు నరసింహారావు, ఎర్రుపాలెం మండల తహసీల్దారు ఉషా శారద , ఎంపిడివో బి. సురేందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.