వార్డు కౌన్సిలర్లుగా ఎనిమిది మంది ఘన విజయం
మున్సిపల్ లోని 26 సభ్యుల్లో మెజారిటీ సభ్యులు వీరే
మున్నూరు కాపులకు కలిసొచ్చిన బీసీ రిజర్వేషన్ అంశం
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెట్ పల్లి పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. బీసీ రిజర్వేషన్ల కోటాలో భాగంగా తమకు కేటాయించిన స్థానాల్లోని 8 స్థానాల్లో ఘన విజయం సాధించారు. మెట్ పల్లి మున్సిపల్ లో మొత్తం 26 వార్డులకు గాను 9 వార్డులు బీసీలకు, ఇంకో 12 వార్డులను జనరల్, జనరల్ మహిళా స్థానాలకు కేటాయించారు. అయితే ఇందులో దాదాపు మూడో వంతు స్థానాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కౌన్సిలర్లుగా కొలువుదీరారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు సామాజిక సమీకరణలో భాగంగా జనరల్ స్థానాల్లోను మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇచ్చాయి.
మున్నూరు కాపులకు కలిసొచ్చిన బీసీ రిజర్వేషన్ అంశం
2026 మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మున్నూరు కాపులకు కలిసొచ్చినట్లు అయ్యింది. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 26 వార్డులు ఉండగా ఇందులో బీసీలకు తొమ్మిది స్థానాలు, మరో 12 జనరల్, జనరల్ మహిళకు కేటాయించారు. ఎన్నికల అనంతరం విడుదలైన ఫలితాల్లో ఏకంగా 8 స్థానాల్లో మున్నూరు కాపులు ఘన విజయం సాధించారు. పట్టణంలోని 1వ వార్డు నుండి ఓంకారి నవీన్ కుమార్, 9వ వార్డు నుండి బొడ్ల వసుధ నాగేష్, 10వ వార్డు నుండి నునుగొండ నరేష్, 14వ వార్డు నుండి దొనికెల శిరీష నవీన్, 15వ వార్డు నుండి అరిగెల అనూష రాకేష్, 19వ వార్డు నుండి బొడ్ల ఆనంద్, 20వ వార్డు నుంచి మాసుల ప్రవీణ్, 26వ వార్డు నుంచి బొడ్ల రమేష్ లు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఘన విజయం సాధించారు.
గెలిచిన ఎనిమిది మంది కొత్తవారే..
ఇటీవల జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో ఎక్కువ శాతం కొత్తవారే వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. కొంతమందికి రాజకీయ నేపథ్యం ఉండగా మరి కొంతమంది ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 1వ వార్డు నుండి పోటీచేసి విజయం సాధించిన ఓంకారి నవీన్ కుమార్ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించి బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. ఆయన తండ్రి ఓంకారి అంజయ్య రాజకీయ అనుభవం నవీన్ కు కలిసి కలిసి వచ్చినట్లయింది. 9వ వార్డు నుండి బొడ్ల వసుధ నాగేష్ విజయం సాధించారు. నాగేష్ కూడా కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భార్య వసుధను కౌన్సిలర్ గా గెలిపించుకున్నారు. 10వ వార్డు నుండి నునుగొండ నరేష్ కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 14వ వార్డు నుండి దొనికెల శిరీష నవీన్ ఉండగా నవీన్ కొన్ని ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. బీజేపీ నుండి పార్టీ టికెట్ సంపాదించి భార్య శిరీషను కౌన్సిలర్ గా గెలిపించుకున్నారు. 15వ వార్డు నుండి అరిగెల అనూష రాకేష్ విజయం సాధించగా అరిగెల రాకేష్ బీజేపీలో కీలక కార్యకర్తగా కొనసాగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించడంతో తన భార్యను బరిలోకి దించి విజయం సాధించారు. 19వ వార్డు నుండి బొడ్ల ఆనంద్ కూడా బీజేపీలో ఉండి తొలిసారిగా మున్సిపల్ కౌన్సిలర్ గా విజయం సాధించారు. విద్యార్థి దశనుండే ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసిన ఆనంద్ బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. రిజర్వేషన్ అనుకూలించడంతో ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి విజయం సాధించారు. 20వ వార్డు నుంచి మాసుల ప్రవీణ్ పాత్రికేయ వృత్తిని కొనసాగిస్తూనే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 26వ వార్డు నుంచి బొడ్ల రమేష్ బీజేపీ పట్టణ అధ్యక్షునిగా కొనసాగుతూ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.